: డబ్బులుంటే ఏమయినా కొనగలుగుతాం.. కానీ వర్షాలను కొనగలమా?: హరీశ్‌రావు
హైదరాబాద్‌లో హరితహారం కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున కొనసాగుతోంది. తెలంగాణ మంత్రులు, ప్రభుత్వాధికారులు చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు బీహెచ్ఈఎల్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని అనంతరం మాట్లాడారు. ‘వర్షాలు రావాలన్నా.. వాతావరణం చల్లబడాలన్నా.. ఉష్ణోగ్రతలని నియంత్రించాలన్నా అది మన చేతుల్లో లేదు. అయితే చెట్లు నాటగలిగితే ఆ పనిని అవే చేస్తాయి’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘డబ్బులుంటే ఏమయినా కొనగలుగుతాం.. వర్షాలను కొనగలమా.?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మంచి వర్షాలు పడాలంటే చెట్లు కావాలని ఆయన అన్నారు. ‘పుట్టినప్పుడు ఊయల కావాలి.. దాన్ని తయారు చేయాలన్నా చెట్టేకావాలి. చచ్చినప్పుడు కాల్చడానికీ చెట్టు కట్టే కావాలి’ అని ఆయన అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమ ప్రాధాన్యతను గుర్తించి అందరూ హరితహారంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించబోవని ఆయన అన్నారు.