: హైదరాబాద్‌లో జోరుగా కొనసాగుతోన్న రెండోదశ హరితహారం కార్యక్రమం
తెలంగాణను ఆకుపచ్చగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండోదశ హరితహారం కార్యక్రమం పనులు ఈరోజు హైదరాబాద్‌లో చకచకా కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఫిల్మ్‌నగర్‌లో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ మొక్కలు నాటి ప్రజలందరూ హరితహారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని టీసీఎస్ క్యాంపస్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, భవిష్యత్తు తరాలకు నీరు అందాలంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బేగంపేటలోని పాటిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. గోషామహల్ సెంటర్‌లో హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి మొక్కలు నాటి స్థానికులను ప్రోత్సహించారు. నగర శివారులోని నానక్ రామ్ గూడలో సినీనటుడు దగ్గుబాటి రానా మొక్కలు నాటారు. కేబీఆర్ పార్క్‌లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు తెలుగు సినీనటులు రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్ శివాజీరాజా, తనికెళ్ల భరణి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.