: రైలు ప్రయాణికులు చేసే అత్యధిక ఫిర్యాదులు ఇవి!
ఇండియాలో నిత్యమూ 800కు పైగా రైళ్లు 10 లక్షల మందిని గమ్య స్థానాలకు చేరుస్తుంటాయి. ఇక తాము మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని రైల్వే శాఖ ఎంతగా చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో రైల్వేలపై 18,662 ఫిర్యాదులు అందగా, ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో 3 వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. ఇక వీటిల్లో ఆహార పదార్థాల్లో నాణ్యత లేదని, అధిక ధరలకు అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదులే అత్యధికం. ఇవి 29.49 శాతం ఉన్నాయి. ఆపై సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని 17.98 శాతం, రిజర్వేషన్లు దొరకడం లేదని, ఏజంట్లు తన్నుకుపోతున్నారని 10.86 శాతం, పార్శిల్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు పడుతున్నామని 8.45 శాతం, అవినీతి, లంచాలు పెరిగాయని 8.34 శాతం ఫిర్యాదు చేశారు. వీటితో పాటు బెర్తుల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని, బుకింగ్ కౌంటర్ల వద్ద సమస్యలపై, హౌస్ కీపింగ్ సిబ్బంది అమర్యాద ప్రవర్తనలు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనితీరు, విచారణ కేంద్రాల్లో సరైన సమాచారం లేకపోవడం వంటి అంశాలపైనా ప్రయాణికులు ఫిర్యాదులు చేశారు.