: చైనాకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ పురాతత్వ శాస్త్రవేత్త పోరాటం
చైనాకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ పురాతత్వ శాస్త్రవేత్త కాదిర్ తిమోరీ పోరాటం ప్రారంభించారు. గతంలో ఆఫ్ఘనిస్థాన్ లోని బమియాన్ బుద్ధ విగ్రహాలను తాలిబన్లు కూల్చి వేసినప్పుడు ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెట్టాయి. అంతకుమించిన విధ్వంసానికి చైనా పూనుకుంటోందని ఆయన ఆరోపించారు. ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి కాంస్య యుగపు మెస్ ఐనాక్ ప్రాంతాన్ని తవ్వి పారేసేందుకు చైనా మెటలర్జికల్ గ్రూప్ కార్పొరేషన్ (ఎంసీసీ) బిడ్డును దక్కించుకుంది. ప్రపంచంలోనే అపార రాగి గనులు ఈ ప్రాంతంలో ఉన్నాయని ఆయన చెబుతున్నారు. కాబూల్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఐదు లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలోని మెస్ ఐనాక్ లో రాగి గనులతోపాటు కాలగర్భంలో కలసిపోయిన అపార బౌద్ధ చరిత్ర దాగి ఉందని ఆయన చెబుతున్నారు. ఇక్కడి భూగర్భంలో కనీసం నాలుగు వందల బుద్ధుడి విగ్రహాలు, వందలాది దేవాలయాలు, అపార బంగారు, రాగి నాణాలు, నగలు ఉన్నాయని గతంలో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన అఫ్ఘాన్ పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంత విలువైన పురాతత్వ సంపదను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్న ఆఫ్ఘన్, చైనా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం ప్రారంభించారు. ఈ ప్రాంత చారిత్రక విలువను చాటి చెబుతూ సేవ్ మెస్ ఐనాక్ పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ఆఫ్ఘనిస్థాన్, చైనాలను ఎదుర్కోవాలంటే తమ శక్తి చాలదని, ప్రపంచం మొత్తం కదిలిరావాలని ఆయన పిలుపునిస్తున్నారు. గతంలో బమియాన్ బుద్ధ విగ్రహాలను కూల్చేసినప్పుడు ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయినవారంతా వచ్చి, తమతో గొంతు కలపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో బుద్ధవిగ్రహాల ధ్వంసాన్ని తీవ్రవాదులు చేసినందువల్లే ప్రపంచ దేశాలు ఖండించాయా? లేక బుద్ధుడిపై గౌరవంతోనా? అన్న విషయం తమ పోరాటానికి మద్దతివ్వడం ద్వారా తెలిసిపోతుందని ఆయన పేర్కొన్నారు.