: వీణ-వాణిలను పరామర్శించిన దత్తన్న.. వారి ఆపరేషన్ అంశాన్ని జేపీ నడ్డాతో చర్చిస్తానని వ్యాఖ్య
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈరోజు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించారు. అవిభక్త కవలలు వీణ-వాణిలకు ఆపరేషన్ నిర్వహించాల్సిందిగా ఇటీవలే వారి తల్లిదండ్రులు ఆసుపత్రి సుపరింటెండెంట్‌కి అంగీకార పత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉంటోన్న వీణ-వాణిలను దత్తాత్రేయ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీణ-వాణిల ఆపరేషన్ అంశం కేంద్ర ప్రభుత్వ దృష్టిలోనూ ఉందని అన్నారు. వారి చదువు, స్కాలర్ షిప్‌ల అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో వీణ-వాణిల గురించి మాట్లాడతానని చెప్పారు. అవిభక్త కవలల పరిస్థితి గురించి తాను డాక్టర్లను అడిగి తెలుసుకున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.