: అమెరికాలో హింసాత్మకంగా మారిన ఆందోళనలకు కారణాలేవి..? మూలాలేమిటి?
నల్లజాతీయులు అమెరికాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తోన్న ఆందోళనలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే, అసలు అమెరికాలో హింసాత్మకంగా మారిన ఆందోళనలకు కారణాలేవి..? మూలాలేవి..? పోలీసులపై కాల్పులు జరిపేంతగా వారిని కోపానికి గురి చేసిన అంశాలేంటి..? ఆల్టన్ స్టెర్లింగ్ అనే 37 ఏళ్ల ఓ నల్లజాతీయుడు అమెరికాలోని ఓ ప్రదేశంలో వృత్తిరీత్యా సీడీలు అమ్ముకుంటున్నాడు. అతని వద్దకు ఓ బిక్షగాడు వచ్చి డబ్బులివ్వాల్సిందిగా కోరాడు. ఆల్టన్ స్టెర్లింగ్ ఇవ్వను పొమ్మన్నాడు. బిక్షగాడు ఆల్టన్ స్టెర్లింగ్ ని విసిగించాడు. డబ్బు ఇమ్మని పదే పదే కోరాడు. దీంతో ఆల్టన్ స్టెర్లింగ్ తన వద్దనున్న తుపాకి చూపించి, పోతావా.. లేదా.. అన్నాడు. ఆ బిక్షగాడికి కోపం వచ్చింది. వెంటనే 911 నంబరుకి కాల్ చేసి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆల్టన్ స్టెర్లింగ్ ను అదుపులోకి తీసుకోవాలనుకున్నారు. కానీ పోలీసులకి స్టెర్లింగ్ లొంగిపోకుండా అటు ఇటూ తిరిగాడు. అతని వద్ద తుపాకీ ఉందని పోలీసులు ధ్రువీకరించుకున్నారు. అసలు ఆ నల్లజాతీయుడు వారిని ఏమీ బెదిరించకుండానే అలెర్ట్ అయిపోయారు. అంతే, గుండెల్లో తుపాకీ పేల్చాడు ఓ పోలీస్. దీంతో ఆల్టన్ స్టెర్లింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఈనెల 5 వ తేదీన జరిగింది. అమెరికాలో నివసిస్తోన్న మరో నల్ల జాతీయుడు ఫిలాండో క్యాజిల్ కి 32 ఏళ్లు. అతనికి నేర నేపథ్యం ఉంది. ఈనెల 6న తన ప్రియురాలు, ఆమె కుమార్తెతో కలసి కార్లో ప్రయాణిస్తున్నాడు. ఫిలాండో క్యాజిల్ ప్రయాణిస్తోన్న కారుని పోలీసులు కారు ఆపాల్సిందిగా కోరారు. కారు ఆపిన ఫిలాండో క్యాజిల్ ని తన డ్రైవింగ్ లైసెన్సు చూపించాల్సిందిగా ఆదేశించారు. క్యాజిల్ డ్రైవింగ్ లైసెన్స్ తీయడానికి పక్కకు ఒరిగాడు. తన వద్ద లైసెన్స్‌డ్ తుపాకీ ఉందని తర్వాత తెలిస్తే పోలీసులు ఎలా స్పందిస్తారోనన్న ఉద్దేశంతో, ఎందుకైనా మంచిదని ముందుగానే ఆ విషయాన్ని అతను పోలీసులకు చెప్పేశాడు. అంతే, ఏమాత్రం ఆలస్యం కాలేదు. ఫిలాండో క్యాజిల్ వద్ద తుపాకీ ఉందని గమనించిన పోలీసు అధికారి.. క్యాజిల్ గుండెల్లో తుపాకి పేల్చాడు. దీంతో ఫిలాండో ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఇటీవల అమెరికాలో నల్లజాతీయులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలపడానికి, డలాస్ లో అక్కడి పోలీసులపై నల్లజాతీయులు విరుచుకుపడడానికి ఈ రెండు ఘటనలే ప్రధాన కారణం. అమెరికాలలో నివసిస్తోన్న నేర చరిత్ర ఉన్న నల్లజాతీయులపై కొన్నేళ్లుగా అక్కడి పోలీసులు చిన్న చిన్న విషయాలకే కాల్పులు జరుపుతున్నారు. ప్రతీ ఏడాది ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. పోలీసు బాడీక్యామ్‌లు, కొందరు పౌరులు పోలీసుల చర్యలపై తీస్తోన్న వీడియోలతో రెండు మూడేళ్లుగా ఇటువంటి సంఘటనలు జరిగినట్లు ప్రజలకి తెలుస్తున్నాయి. ఇటువంటి ఘటనలు వెలుగులోకొచ్చినప్పుడు అక్కడ ఆందోళనలు చెలరేగుతున్నాయి. గత సంవత్సరం బాల్టిమర్‌లో ఓ నల్లజాతి యువకుడిపై అక్కడి పోలీసులు ప్రవర్తించిన తీరుకి అతడు కోమాలోకి వెళ్లాడు. యువకుడిని పోలీసులు వ్యాన్‌లో వేసి తరలించే క్రమంలో అతనికి దెబ్బలు తగిలాయి. దీంతో ఆ యువకుడు కోమాలోకి వెళ్లిపోయాడు. గత ఏడాది పోలీసులు అమెరికాలో జరిపిన కాల్పుల్లో మొత్తం 505 మంది చనిపోయారు. వారిలో ఎనిమిది మంది మహిళలు సహా 325 మంది నల్లజాతీయులే! నల్లజాతీయుల నిరసనలకు కారణాలివే... నల్లజాతి వారిపై తెల్లజాతి వారు దాడులు జరపడానికి కారణాలను అన్వేషిస్తే.. కొన్ని వందల ఏళ్ల క్రితం తెల్లవారు నల్లజాతి వారిని బానిసలుగా చూస్తూ వ్యాపారం చేసిన సంగతి తెలిసిందే. ఆఫ్రికా నుంచి తెల్లవారు నల్లజాతి వారిని గొలుసులతో కట్టేసి, తరలించి అమెరికాలో అమ్ముకున్నారు. ఓ పశువు పట్ల దాని యజమాని ఎలా ప్రవర్తిస్తాడో నల్లవారి పట్ల తెల్లవారు అలా ప్రవర్తించే వారు. నల్లజాతీయుడు వేగంగా ప్రతిఘటించే శక్తి ఉన్నవాడని తెల్లవారు భావిస్తూ, వారి కన్నాముందే వారిని దెబ్బకొట్టాలని ఆలోచించేవారు. వాళ్ల చాకిరీతోనే 'సంపన్న అమెరికా' నిర్మాణానికి పూనుకున్నారు. ఆ కాలంలో జరిగిన అంతర్యుద్ధం తర్వాత అబ్రహం లింకన్ నల్లజాతికి స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ ఆ భావజాలం కలిగిన వైఖరి పూర్తిగా తొలగడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. అప్పుడప్పుడూ ఇలాంటి జాతి వివక్షధోరణి చెలరేగుతూనే ఉంది. నేటికీ కొనసాగుతోంది. పోలీసులు చెబుతున్న కారణాలివి.. నల్లజాతి వారిని హత్య చేసిన ప్రతిసారీ పోలీసులు ఒకే తరహా సమాధానాలు చెబుతున్నారు. పొంతనలేని కారణాలను చెబుతున్నారు. తాము కాల్చి చంపిన వ్యక్తులకు నేర చరిత్ర ఉందని, వారి వద్దకు వెళితే ఎదురుతిరిగారని, తమ తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశారని... ఇలా పోలీసులు కుంటి సాకులు వినిపిస్తున్నారు. నిజమే, పేదరికంతో నలిగిపోయే నల్లజాతివారిలో నేర ప్రవృత్తి అధికమే. వారి ఆకలే దానికి మూలం. వారికి ఉపాధి దొరకకపోవడం, ఉపాధి కల్పనలో వివక్ష లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆదిమ జాతి రెడ్ ఇండియన్లను మినహాయించి చూస్తే, నల్లజాతీయులు అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ఎంతగానో వెనకబడి ఉన్నారు. నల్లజాతి వారి ఆదాయం 25-30 వేల డాలర్లు మాత్రమే. మరోవైపు, తెల్లజాతి వారి కుటుంబ ఆదాయం ఏడాదికి 50-55 వేల డాలర్లుగా ఉంది. ఆయా సంస్థలు లాభాల్లో కొనసాగుతున్నప్పుడు, దేశ ఆర్థిక పరిస్థితి బాగున్నపుడు అందరికన్నా చివరిగా మాత్రమే నల్లజాతి వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆర్థిక సంక్షోభం తలెత్తినపుడు మాత్రం ఉద్యోగాలపై వేటు వేయాలంటే నల్లజాతీయులనుంచే మొదలుపెడతారు. ఆ వివక్ష నుంచి పుట్టిన వేదన నల్లజాతీయుల్లో ఇప్పుడు బడబాగ్నిలా రగులుతోంది. ఇప్పుడు పోలీసులపై తిరుగుబాటుకి కారణం అదే!