: కేసులకు భయపడేది లేదు!... రాజకీయ కక్షసాధింపుల్లో భాగమే కేసులన్న చెవిరెడ్డి!
తనపై వరుసగా నమోదవుతున్న కేసులపై వైసీపీ కీలక నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అరెస్టైన ఓ కేసులో రిమాండ్ కు వెళ్లి నేటి ఉదయం తిరుపతి సబ్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఆయనను ఎంఆర్ పల్లి పోలీసులు వెనువెంటనే అరెస్ట్ చేశారు. మరోమారు ఆయనను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత చెవిరెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. గడపగడపకూ వైసీపీ కార్యక్రమంలో చంద్రబాబు సర్కారు పాల్పడుతున్న దుర్మార్గాలను ప్రజలకు వివరించేందుకు యత్నించిన మేరకే తనను అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.