: థియేటర్ల కోసం రోడ్డెక్కిన ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ చిత్రం యూనిట్!... మద్దతు పలికిన టాలీవుడ్ ప్రముఖులు!
తెలుగు చిత్రసీమ టాలీవుడ్ లో పెను వివాదం రేగింది. చిన్న నిర్మాతలు తీసిన చిత్రాలకు థియేటర్లు దొరకని వైనంపై నెలకొన్న ఈ వివాదంపై బాధిత నిర్మాతలు ఆందోళనకు దిగగా, టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. వివరాల్లోకెళితే... చిన్న నిర్మాతలు కొందరు కలిసి నిర్మించిన ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ చిత్రం విడుదలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. చిత్రం విడుదల కోసం నిర్మాతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకోగా... సరిపడినన్ని థియేటర్లు లభ్యం కాలేదు. అంతేకాకుండా, చిత్ర ప్రదర్శన కోసం అప్పటిదాకా సరేనన్న కొన్ని థియేటర్ల యాజమాన్యాలు కూడా చివరి నిమిషంలో మాట మార్చేశాయి. దీంతో చేసేది లేక జరిగిన అన్యాయంపై ఆ చిత్ర యూనిట్ మొత్తం హైదరాబాదు, జూబ్లిహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ హీరో ఆదిత్య ఓం, ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ తదితరులు వారికి మద్దతు పలికారు.