: ‘లింగమనేని హౌస్’పై వివాదానికి తెర!... స్మార్ట్ పల్స్ సర్వేలో అసలు విషయం చెప్పిన చంద్రబాబు!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పాలనను విజయవాడకు మార్చేసిన తర్వాత, అంతకుముందు కృష్ణా నది కరకట్టలపై అక్రమ కట్టడాలకు నోటీసుల సందర్భంగా ‘లింగమనేని హౌస్’ పేరిట అక్కడ వెలసిన అధునాతన భవంతిపై పెను వివాదమే రేగింది. అక్రమ కట్టడాలన్నింటికీ నోటీసులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం లింగమనేని హౌస్ ను ఎలా వదిలేసిందని, అంతేకాకుండా వివాదాల్లో చిక్కుకున్న సదరు భవంతిలో చంద్రబాబు ఎలా నివాసముంటారని విపక్షం వైసీపీ ప్రశ్నించింది. అంతేకాకుండా సదరు భవంతిని చంద్రబాబు తన సొంతం చేసుకున్నారని కూడా ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే ఈ వివాదానికి చంద్రబాబు నిన్న తెర దించారు. స్మార్ట్ పల్స్ సర్వే సందర్భంగా లింగమనేని హౌస్ వద్దే తన వివరాలు వెల్లడించిన చంద్రబాబు తనకు శాశ్వత నివాసం లేదని చెప్పారు. ప్రస్తుతం తాను నివాసముంటున్న లింగమనేని హౌస్ ఆర్సీసీ శ్లాబ్ రకానికి చెందినదని చెప్పిన ఆయన... సదరు భవంతిని ప్రభుత్వం అద్దెకు తీసుకుందని చెప్పారు. ఆ నివాసం సొంతమా? అద్దె ఇల్లా? అని ప్రశ్నించిన ఎన్యూమరేటర్ ప్రశ్నలకు స్పందించిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సొంతమంటే కబ్జా అంటారు. ఈ భవనాన్ని ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఇంకా స్వాధీనం చేసుకోలేదు’’ అని ఆయన అసలు విషయాన్ని వెల్లడించారు.