: ఏపీలోని వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని అమిత్ షా చెప్పారు: హరిబాబు
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడుతున్న రాజకీయ శూన్యతను పార్టీకి అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏపీలో వైఎస్సార్సీపీ కోలుకునే అవకాశం లేదని, మరిన్ని వలసలు ఆ పార్టీని వేధిస్తాయని, అలాగే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు లేవని, ఇక కోలుకోలేదని పార్టీ అధిష్ఠానం గుర్తించిందని అన్నారు. అందుకే వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఇతర పార్టీల వైపు చూస్తున్న నేతలను గుర్తించాలని, వారిని బీజేపీలోకి ఆహ్వానించాలని అమిత్ షా సూచించారని ఆయన చెప్పారు. ఏపీలో ఏర్పడే రాజకీయ శూన్యాన్ని బీజేపీ ద్వారా భర్తీ చేయాలని స్పష్టం చేశారని ఆయన తెలిపారు. త్వరలోని పలువురు నేతలతో చర్చించి అందుకు తగ్గ ప్రణాళికలను రచిస్తామని ఆయన చెప్పారు.