: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నట్టు లేదు.. భారత్‌లోనే ఉన్నట్టుంది: మోదీ
నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ఏర్పడుతోన్న సవాళ్లను స్వీకరించి, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు కలిసి పోరాడతామని తెలిపారు. భారత్‌కు ఎన్ఎస్‌జీ సభ్యత్వంపై దక్షిణాఫ్రికా మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నట్టు లేదని, భారత దేశంలోనే ఉన్నట్టుందని మోదీ పేర్కొన్నారు. తాము పుట్టిన దేశం కోసం పోరాడిన గొప్పనేతలు మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలాకు ఈరోజు అక్కడ నివాళులర్పించడం తనకు వచ్చిన ఒక గొప్ప అవకాశమేనని ఆయన అన్నారు.