: కుమార్తెకు మంత్రి పదవిని ఇవ్వడంతో, నరేంద్ర మోదీకి కటీఫ్ చెప్పిన తల్లి!


ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ లో పిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా అనుప్రియా పటేల్ బాధ్యతలు స్వీకరించిన మూడు రోజుల తరువాత, ఆమె తల్లి, అప్నాదళ్ పార్టీ సుప్రీమో కృష్ణా పటేల్, ఎన్డీయేకు మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు. గత సంవత్సరం పార్టీలో విభేదాలు రాగా, అనుప్రియను ఆమె తల్లే పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇక అనుప్రియకు పదవిని ఇచ్చే విషయంలోనూ కూటమి ధర్మాలకు ఎన్డీయే కట్టుబడలేదని, కనీసం మోదీ కూడా తమకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె, ఇకపై కూటమిలో కొనసాగబోవడం లేదని తేల్చి చెప్పారు. వచ్చే సంవత్సరం జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు లేకుండా బరిలోకి దిగుతుందని తెలిపారు. వారణాసిలో వచ్చే నెలలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. యూపీలో కుర్మీ వర్గం వారి మద్దతు అధికంగా కూడగట్టుకున్న అప్నాదళ్, యూపీ ఎన్నికల వరకూ బీజేపీ కూటమిలో అత్యంత కీలకం. వారి ఓట్ల కోసమే అనుప్రియకు మంత్రి పదవి దక్కిందని రాజకీయ నిపుణులు విశ్లేషించారు కూడా. ఇక తాజా పరిణామాలు ఎటువైపునకు దారితీస్తాయో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News