: బీజేపీ ‘కమలం’ గుర్తుపై అభ్యంతరం... బాంబే హైకోర్టులో పిల్!
భారతీయ జనతా పార్టీ... ప్రస్తుతం కేంద్రంలోనే కాక మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా తదితర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బలమైన పార్టీ. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాతి స్థానం ఆ పార్టీదే. ‘జన సంఘ్’గా చిన్న కాలువలా ప్రయాణం మొదలెట్టి ఆ తర్వాత ‘భారతీయ జనతా పార్టీ’గా రూపాంతరం చెందిన ఈ పార్టీ అనతికాలంలోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ఈ పార్టీ ఎన్నికల గుర్తేమిటి?... ‘కమలం’ కదా అని టక్కున చెప్పేస్తాం. ఎన్నికల గుర్తే కాదండోయ్, కాషాయ రంగులో ఉండే ఆ పార్టీ పతాకంపైనా ‘కమలం’ దర్శనమిస్తుంది. అయితే ‘కమలం’ గుర్తు ఇంకా ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటుందా? లేక ఆ పార్టీ ఇంకో గుర్తును చూసుకోవాలా? అన్న విషయం ప్రస్తుతం బాంబే హైకోర్టు చేతిలో ఉంది. అసలు విషయం ఏమిటంటే... బీజేపీకి ‘కమలం’ గుర్తు ఎలా కేటాయిస్తారంటూ బాంబే హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జాతీయ చిహ్నమైన ‘కమలం’ గుర్తును రాజకీయ పార్టీలకు ఎలా కేటాయిస్తారని సదరు పిల్ దాఖలు చేసిన సామాజిక ఉద్యమకర్త హేమంత్ పాటిల్ వాదిస్తున్నారు. కమలం’ గుర్తును ఎన్నికల చిహ్నంగా వాడుకుంటూ బీజేపీ ‘‘ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ (ప్రివెన్షన్ ఇంప్రాపర్ యూజ్) యాక్ట్, 1950’ని ఉల్లంఘిస్తోందని కూడా పాటిల్ ఆరోపిస్తున్నారు. తక్షణమే బీజేపీ ఎన్నికల గుర్తుగా ఉన్న ‘కమలం’ స్థానంలో ఇంకో గుర్తును ఆ పార్టీకి కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన బాంబే హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం వచ్చే వారం విచారణ చేపట్టనుంది.