: రేపే మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ
రేపు మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అవినీతి ఆరోపణలు, దావూద్ తో నిత్యం టచ్ లో ఉన్నారంటూ వచ్చిన ఆరోపణల నేపధ్యంలో ఏక్ నాథ్ ఖడ్సే గత నెలలో మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన అధీనంలో పది శాఖలుండేవి. ఆయన ఆకస్మిక రాజీనామాతో ఆ శాఖల బాధ్యత కూడా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీదపడింది. ఈ నెల 10న ఫడ్నవీస్ నాలుగు రోజుల పర్యటనకు రష్యా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రేపు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వంలో 19 కేబినేట్, 10 సహాయ మంత్రి పదవులు ఉండగా, మరో 14 శాఖలు అమాత్యులు లేక ఖాళీగా ఉన్నాయి. కేబినెట్ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో పలువురు ఆశావహులు జాతీయ అధ్యక్షడు అమిత్ షాతో పైరవీలు సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేబినెట్ విస్తరణలో మిత్రపక్షం శివసేనకు స్థానం కల్పిస్తారా? లేక తాజాగా నెలకొన్న విభేదాల నేపధ్యంలో మొండిచెయ్యి చూపిస్తారా? అనే చర్చ జరుగుతోంది.