: ఎస్‌ఐ కావాలనుంది, సాయం చేయండి: ఎస్పీని కోరిన హిజ్రా
తనకు ఎస్ఐ కావాలనుందని, అందుకు సాయం చేయమని ఓ హిజ్రా పోలీసు అధికారికి విన్నవించుకున్న సంఘటన కర్నూలు జిల్లా నంధ్యాలలో జరిగింది. కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ నేత్రదానం పట్ల అవగాహన కల్పిస్తూ అక్కడి మహానంది రస్తా పాత కేసీ కెనాల్ భవన సముదాయంలో ఉన్న సమతా హిజ్రాల సంఘం కార్యాలయానికి వచ్చారు. అక్కడకు చేరుకున్న ఎస్పీతో మాధురి తనకున్న ఆశయాన్ని బయటపెట్టింది. తాను కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేసినట్లు, తనది నందికొట్కూరు తాలూకా విపనగండ్ల గ్రామం అని తెలిపింది. పీజీ చదవాలని ప్రయత్నించిన తనకు హిజ్రా అన్న కారణంతో సీటు ఇవ్వడానికి నిరాకరించారని మాధురి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తనలాంటి వారిని పట్టించుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వం హిజ్రాలకు గుర్తింపునిచ్చినా తనకు న్యాయం జరగడం లేదని ఆమె చెప్పింది. తమిళనాడులో ఓ హిజ్రా ఎస్ఐ పోస్టుకు ఎంపికైన విషయాన్ని మాధురి ఎస్పీకి చెబుతూ తన కల కూడా అదేనని పేర్కొంది. కానీ తన ఆశయం నెరవేరుతుందో లేదోనని ఆవేదన వ్యక్తం చేసింది. మాధురి వినతి పట్ల ఎస్పీ సానుకూలంగా స్పందించారు. తమిళనాడులో హిజ్రాకి మహిళల కోటాలో ఎస్ఐ ఉద్యోగం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. మాధురి తన ఆశయాన్ని చేరుకునే దిశగా తాను సహకరిస్తానని ఆయన చెప్పారు. మాధురి ఎస్‌ఐ సెలక్షన్‌లో పాల్గొనేలా చేస్తానన్నారు. మాధురి పరీక్షలకు సిద్ధమయేందుకు మెటీరియల్ కూడా అందిస్తామని ఆయన అన్నారు.