: కాపులను చంద్రబాబు మోసం చేశారు: దిగ్విజయ్ సింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గాన్ని మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో ఆయన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ మంత్రులు బాలరాజు, కొండ్రు మురళీతో పాటు పలువురు ముఖ్య కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాపుల రిజర్వేషన్ల కోసం సాగిస్తోన్న ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయాలు పాటించకుండా దేవాలయాలను కూల్చివేస్తోందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. రైతుల భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని, దాని పట్ల పాటించాల్సిన నిబంధనలను ఏపీ ప్రభుత్వం గాల్లో వదిలేసిందని ఆయన అన్నారు. ప్రజలకు న్యాయం అందే క్రమంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన తెలిపారు.