: సరోజనీదేవి కంటి ఆసుపత్రి ఘటనపై విచారణకు ఆదేశం.. డాక్టర్ల తప్పేమీలేదని స్పష్టం
హైదరాబాద్‌లోని సరోజనీదేవి కంటి ఆసుపత్రి ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా కంటి వైద్య నిపుణులు రవీందర్ గౌడ్‌ని నియమించింది. రోగులు కంటి చూపు కోల్పోయే ప్రమాదానికి గురైన ఘటనలో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని రవీందర్ గౌడ్ అన్నారు. సెలైన్‌లో బ్యాక్టీరియా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. శస్త్రచికిత్స చేయించుకున్న 13 మంది రోగుల్లో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కళ్లను శుభ్రం చేసేందుకు వాడే సెలైన్ బాటిల్‌లో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బ్యాక్టీరియా ఉన్న ద్రవంతో కళ్లు శుభ్రం చేయడం వల్లే రోగులు కంటిచూపుకోల్పోయే ప్రమాదం సంభవించిందని వివరించారు. రోగులకు చూపు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.