: జర్నలిస్ట్ పై తేజ్ ప్రతాప్ వీరంగం!... చివరికి కొడుకుతో జర్నలిస్ట్ కు షేక్ హ్యాండిప్పించిన లాలూ!


రాజకీయాల్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కాకలు తీరిన యోధుడే. దాణా స్కాంలో దోషిగా తేలిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోక తప్పలేదు. అయినా ఆయన తన వారసులను రంగంలోకి దించి తనదైన శైలిలో బీహార్ రాజకీయాలను శాసిస్తున్నారు. అయితే రాజకీయ అనుభవం అంతంతమాత్రంగానే ఉన్న ఆయన పుత్రరత్నాలు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ లు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నితీశ్ కుమార్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న చిన్నోడు తేజస్వీ యాదవ్ కాస్తంత ఒద్దికగానే ఉంటున్నా... ఆరోగ్య మంత్రిగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రం వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. నిన్న పాట్నాలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆర్జేడీ 20వ వార్షికోత్సవం సందర్భంగా తండ్రి, తమ్ముడితో కలిసి కార్యక్రమానికి హాజరైన తేజ్ ప్రతాప్... ఓ జర్నలిస్టుపై బెదిరింపులకు దిగారు. కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ స్టిల్ కెమెరా తీసుకుని ఫొటోలు తీస్తుండగా, ఓ జర్నలిస్టు తన సెల్ ఫోన్ లో మంత్రిగారి ఫొటోగ్రఫీని బంధించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తేజ్ ప్రతాప్ సదరు చిత్రాలను తొలగించాలని విలేకరిని కోరారు. అయితే అందుకు ససేమిరా అన్న జర్నలిస్ట్ పై ఆయన బెదిరింపులకు దిగారు. కేసు పెడతానని హెచ్చరించారు. దీంతో జర్నలిస్ట్ కు మద్దతుగా నిలిచిన మీడియా ప్రతినిధులు బెదిరిస్తే కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని, కవరేజీ చేయమని ఎదురు తిరిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న లాలూ అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు. లాలూ చెప్పినా... సదరు ఫొటోలను తొలగించేందుకు సదరు జర్నలిస్ట్ ససేమిరా అన్నారు. ఆ తర్వాత వేదికపైకి సదరు జర్నలిస్ట్ ను ఆహ్వానించిన లాలూ... తన కుమారుడు తేజ్ ప్రతాప్ తో షేక్ హ్యాండిప్పించి, వివాదానికి ముగింపు పలికారు.

  • Loading...

More Telugu News