: చంద్రబాబుతో భేటీ కోసం... రేపటి దాకా బెజవాడలోనే గవర్నర్!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే నిమిత్తం ప్రొటోకాల్ ను పక్కనబెట్టేసిన ఉమ్మడి రాష్టాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు విజయవాడకు బయలుదేరుతున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కోసం ఈ సాయంకాలం విజయవాడ వెళుతున్న నరసింహన్ నేటి రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ప్రొటోకాల్ ను పక్కనబెట్టేందుకు సిద్ధపడ్డ నరసింహన్... చంద్రబాబుతో భేటీ కోసం నేటి రాత్రి ఏకంగా బెజవాడలోనే బస చేయనున్నారు. చంద్రబాబు బిజీ షెడ్యూల్ పై ఆరా తీసిన రాజ్ భవన్... గవర్నర్ పర్యటనను ఉదయానికి బదులు సాయంత్రానికి మార్చేసిందట. రాత్రి బెజవాడలో బస చేసిన తర్వాత రేపు ఉదయం చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత కాని అక్కడి నుంచి నరసింహన్ బయలుదేరట్లేదు. చంద్రబాబుతో భేటీ ముగియగానే అక్కడి నుంచే ఆయన తిరుమల వెళ్లనున్నారు.