: దేశానికి శత్రువు...మాక్కూడా శత్రువే: అసదుద్దీన్ ఒవైసీ
ఐఎస్ఐఎస్ ను అంతమొందించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కరాఖండీగా చెప్పారు. హైదరాబాదులో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద అనుమానితులకు న్యాయసాయం అందిస్తామని ప్రకటించడంపై ఆయన మాట్లాడుతూ, దేశానికి శత్రువు అంటే తమకు కూడా శత్రువేనని అన్నారు. ఐఎస్ఐఎస్ ను అంతమొందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. దీనిపై ప్రకటన విడుదల చేసిన అనంతరం ట్విట్టర్లో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, స్వామి అసిమానంద్ పైనా తీవ్రవాద ఆరోపణలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. వీరి తీవ్రవాద కార్యకలాపాలపై ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలను ఆయన ప్రశ్నించారు. న్యాయసహాయం పొందడం నిందితుల హక్కు అని చెప్పిన ఆయన, వారికి న్యాయసహాయం అందిస్తామని మరోసారి స్పష్టం చేశారు.