: 'లాడ్జ్' వేరియంట్ కార్ల ధరలను భారీగా తగ్గించిన రెనాల్ట్!
భారత మార్కెట్లో మరింత మార్కెట్ వాటాను కోరుకుంటున్న రెనాల్ట్ సంస్థ కార్ల ధరలు భారీగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పోటీలో ఉన్న ఇన్నోవా, ఎర్టిగాలకు ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలోనే రెనాల్ట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. మారిన ధరల మేరకు రెనాల్ట్ లాడ్జీ ఎస్టీడీ వేరియంట్ ధర రూ. 96 వేలు తగ్గి రూ.7,58,831కు చేరింది. ఇదే సమయంలో లాడ్జీ ఆర్ఎక్స్ఈ ధర రూ. 80 వేలు తగ్గి రూ.8,56,831కు చేరిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. లాడ్జి బ్రాండ్ లోనే ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ ధరను రూ. 55 వేలు తగ్గిస్తూ, రూ.9,43,831గాను, ఆర్ఎక్స్ జడ్ వేరియంట్ ధరను రూ. 34 వేలు తగ్గిస్తూ, రూ. 10,99,000 గానూ నిర్ణయించినట్టు సంస్థ ప్రకటించింది. కాగా, రెనాల్ట్ సంస్థ లాడ్జి సిరీస్ ను గత సంవత్సరం ఏప్రిల్ లో మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కారు విడుదల చేసి సంవత్సరం దాటినా అమ్మకాలు 1300 కూడా దాటని కారణంగానే ధరలను భారీగా తగ్గించినట్టు సమాచారం.