: సింగర్ అవతారమెత్తిన సన్నీలియోన్.. ‘సినిమా కోసం కాదు ఓ ఈవెంట్ కోసం రిహార్సల్స్’ అంటూ ట్వీట్
బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ సింగర్ అవతారం ఎత్తింది. బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా కనిపించిన ఈ సుందరి ఇటీవల తన దూకుడుని తగ్గించింది. ఇప్పుడు ఈ అమ్మడు రియాలిటీ టీవీ స్ప్లిట్స్ విల్లా సీజన్ 9 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సన్నీ.. ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా ఓ ఫోటో పోస్ట్ చేసింది. సన్నీలియోన్ తాను పోస్ట్ చేసిన ఫోటోలో మైక్ ముందు నిల్చొని పాట పాడుతున్నట్లు కనిపించింది. తనలో ఉన్న భయాలన్నింటినీ పక్కకు పెట్టి ముందుకు వెళుతున్నానని తాను చేసిన పోస్ట్ లో సన్నీ పేర్కొంది. ఫైనల్ గా బిగ్గరగా పాడగలిగినట్లు ఆమె చెప్పింది. తాను రిహార్సల్స్ కోసం ఒక నెల రోజుల సమయాన్ని వెచ్చించినట్లు ఆమె పేర్కొంది. తన అభిమానులకు నచ్చుతుందని తాను అనుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో సన్నీలియోన్ ఫోటోను చూసిన తన అభిమానులు ఇక ఆమె సింగర్‌గా మారుతున్నట్లు భావించారు. సినిమాల్లో పాటలు పాడుతుందేమోనని సందేహాన్ని వ్యక్తం చేశారు. అయితే సన్నీ సోషల్ మీడియాలో మళ్లీ స్పందించి, తాను సినిమాల్లో పాడడం లేదని, తాను త్వరలో హాజరుకాబోతోన్న ఓ ఈవెంట్ కోసమే రిహార్సల్స్ చేశానని పేర్కొంది. ఆ ఈవెంట్ లో మాత్రమే పాడనున్నట్లు ట్వీట్ చేసింది.