: ‘ఉచితం’ వద్దంటున్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్!
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఉచిత మంత్రాన్ని పఠిస్తున్నాయి. జనం అడక్కున్నా... ఆయా పార్టీలు ‘ఉచితం’పై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉచితానికి మంగళం పాడి, ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ దిశగా పారిశ్రామికవేత్తలు కీలక భూమిక పోషించాలని ఆయన కోరారు. నిన్న హైదరాబాదులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్ ట్యాప్సీ) శతాబ్ది ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమలు తప్పనిసరిగా పాటించాల్సిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)ను ప్రధానంగా ప్రస్తావించారు. పారిశ్రామికవేత్తలు పల్లె సీమలను పట్టణాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు పాటు పడాలన్నారు. తమ సీఎస్ఆర్ నిధులను పట్టణాలకు కాకుండా గ్రామీణ ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. ‘‘సామాజికంగా వివిధ వర్గాలను ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహిస్తేనే మంచి ఫలితాలుంటాయి. వారికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలి. సంపాదించే శక్తినీ ఇవ్వాలి. దాంతో వారు ఆత్మ గౌరవంతో జీవనం కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఉచిత పథకాలను తప్పనిసరిగా రద్దు చేయాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.