: అమెరికా వెళితే సంప్రదాయ దుస్తులు ధరించవద్దు!: ప్రజలను హెచ్చరించిన యూఏఈ
పశ్చిమ దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో పర్యటనలు జరిపే ముస్లింలు సంప్రదాయ దుస్తులను ధరించ వద్దని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కీలక హెచ్చరికలను జారీ చేసింది. ఓహియోలో ఎమిరేట్స్ పర్యాటకుడిని కేవలం దుస్తులు చూసి, అనుమానంతో అరెస్ట్ చేసిన వేళ, సంప్రదాయ దుస్తులు వద్దని, అది వారి భద్రత కోసమేనని యూఏఈ తెలిపింది. యూరోపియన్ దేశాల్లో ఉంటున్న అరబ్ మహిళలు అక్కడి చట్టాలను గౌరవించి ముఖాన్ని కప్పుకోరాదని కూడా పేర్కొంది. కాగా, అమెరికాకు వైద్య చికిత్స కోసం వచ్చిన అహ్మద్ అల్ మన్హాలీ అనే వ్యాపారవేత్త క్లేవ్ ల్యాండ్ ప్రాంతంలో హోటల్ ను బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, క్లర్క్ 911కు ఫోన్ చేసి అనుమానిత ముస్లిం ఉన్నాడని చెప్పడంతో అతన్ని అరెస్ట్ చేశారు. శరీరాన్నంతా కప్పివున్న తెల్లని దుస్తులతో పాటు తలకు తెలుపు రంగు స్కార్ఫ్ కట్టుకుని సంప్రదాయ అరబ్ దుస్తుల్లో ఉండటమే ఆ వ్యాపారి తప్పయింది. అతని చేతులకు బేడీలు వేసి తీసుకువెళ్లిన పోలీసులు విచారణ అనంతరం వదిలి పెట్టారు. తుపాకులు ఎక్కుపెట్టి, హెచ్చరికలు జారీ చేస్తూ, మన్హాలీ వద్దకు పరుగులు పెడుతున్న పోలీసుల దృశ్యాలను టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. గతంలో ఓమారు గుండెపోటుకు గురైన మన్హాలీని ఆపై ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. పోలీసులు, నగర అధికారులు క్షమాపణలు చెప్పినప్పటికీ, తమ దేశ పౌరులు ఈ తరహా ఇబ్బందులకు దూరం కావాలంటే, సంప్రదాయాన్ని పక్కన పెట్టాలని యూఏఈ సర్కారు సలహాలు ఇస్తోంది.