: బిల్డింగులు పర్మినెంట్... సచివాలయం తాత్కాలికమే: చంద్రబాబు
వెలగపూడిలో ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాల్లో సచివాలయాన్ని తాత్కాలికంగా మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని, ఈ భవనాలు అమరావతిలో తొలి భవనాలుగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరింత బెస్ట్ బిల్డింగులు కట్టుకోవాల్సి ఉందని, అందుకు టైమ్ పడుతుంది కాబట్టి, త్వరితగతిన పూర్తయ్యేలా ఈ భవనాలను నిర్మించాలని తాను ఆలోచించినట్టు వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుత భవంతులను రాబోయే రోజుల్లో మరో అవసరానికి ఉపయోగించుకుంటామని తెలిపారు. అమరావతిలో సచివాలయం ప్రపంచ స్థాయి నాణ్యతతో, వన్నాఫ్ ది బెస్ట్ గా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికి భవనాల పనులు మొదలై 136 రోజులైందని, ఇంత రికార్డు సమయంలో పనులను తామెప్పుడూ చేయలేదని స్వయంగా ఎల్అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజీ సంస్థలు తనకు తెలిపాయని చెప్పుకొచ్చారు.