: రోడ్డుప్రమాదంలో గాయపడిన గజరాజు... బాధతో విలవిల్లాడిన మూగజీవి!
వాహనం ఢీకొని ఓ ఏనుగు రోడ్డుపై కుప్పకూలిపోయి నరకయాతన పడిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలో చోటుచేసుకుంది. అక్కడి ఓమనపల్లిలో గజరాజు రోడ్డు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు దాటుతోన్న ఏనుగుని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఏనుగు ముందు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఏనుగు కదలలేని స్థితిలో అక్కడే పడి తీవ్ర బాధను అనుభవించింది. స్థానికులు ఏనుగు బాధను గమనించినా ఏమీ చేయలేకపోయారు. ఏనుగు రోడ్డుపై పడడంతో కాసేపు వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గజరాజుకి అక్కడే ప్రథమ చికిత్స అందించి, వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏనుగు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది.