: అసదుద్దీన్ స్థానిక నేత.. దర్యాప్తును రాజకీయం చేయడం తగదు: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్


హైదరాబాద్ ఎంపీ ఓ స్థానిక నేత అని.. ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్‌ను రాజకీయం చేయడం తగదని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తూ పాతబస్తీకి చెందిన ఐదుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల అదుపులో ఉన్న యువకులు అమాయకులని, వారికి న్యాయ సహాయం అందిస్తామని అసదుద్దీన్ పేర్కొన్న సంగతి విదితమే. ఈ విషయంపై స్పందించిన తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, దేశ భద్రతకు సంబంధించిన ఇటువంటి విషయాల్లో అసదుద్దీన్ జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికారు. ‘‘ఆయనో స్థానిక నేత. అది తప్పనో ఒప్పనో ఆయన భావించవచ్చు. కానీ పోలీసుల అదుపులో ఉన్న యువకులు ఉగ్రవాదులా, అమాయకులా? అన్న విషయం కోర్టు తేలుస్తుంది’’ అని అన్నారు. దర్యాప్తు స్వేచ్ఛగా జరిగేలా చూడాలి కానీ రాజకీయ జోక్యం సరికాదన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఎన్ఐఏ వారిని అదుపులోకి తీసుకుని ఉండదన్నారు. ఇదో సున్నిత అంశమన్న తేజస్వీ.. దేశ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని అనుమానిస్తే ఎవరిపైన అయినా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందన్నారు. ఇటువంటి విషయాల్లో తలదూర్చడం మాని దర్యాప్తు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని అసదుద్దీన్‌కు సూచించారు.

  • Loading...

More Telugu News