: 55 ఏళ్లు ప్రయాణించిన తోకలేని పిట్ట... అయినా సురక్షితంగా గమ్యం చేరింది!
స్మార్టు ఫోన్లు, ఈమెయిల్సు, ఎస్సెమ్మెస్సులు, వాట్స్ యాప్ లు రంగప్రవేశం చేయడంతో, 'తోకలేని పిట్ట' (ఉత్తరం)ను పట్టించుకోవడం మానేశారు కానీ, పాతకాలం వారిని అడిగితే దానితో పెనవేసుకుపోయిన అనుభూతులను కళ్లకు కట్టినట్టు వినిపిస్తారు. ఎక్కడో ఉన్నవారి సంగతులను మూడు రోజులు లేదా మరికొన్ని రోజుల తరువాత తోకలేనిపిట్టలు కళ్లకు కట్టేవి. అందుకే, పోస్ట్ మేన్ తెచ్చే ఆ ఉత్తరాల కోసం అప్పట్లో ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తూ వుండేవారు. అలాంటి ఓ ఉత్తరం సుమారు 55 సంవత్సరాల 13 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ మధ్యే గమ్యం చేరింది. దీంతో ఆ ఉత్తరం చేరాల్సిన వారికి చేర్చేందుకు ఓ కుటుంబం ఇప్పుడు ఎంతగానో శ్రమిస్తోంది. లండన్ లోని ఓ అద్దె ఇంట్లో యువాన్, జేమ్స్ దంపతులు మూడేళ్లుగా నివాసముంటున్నారు. 1960లో బీ.హెచ్. మోర్గాన్ అనే వ్యక్తి తన సోదరులకు రాసిన ఓ ఉత్తరం తాజాగా వీరి అడ్రస్ కు చేరుకుంది. అయితే, ఆ ఉత్తరం అందుకోవలసిన ఆసామీ ప్రస్తుతం ఆ ఇంట్లో లేరు. దానిని తెరచి చూడగా.. ‘‘నేను ఉన్న ప్రదేశంలోని వాతావరణం సరిగా లేదు. కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నా. మీరంతా క్షేమంగా ఉన్నారనే భావిస్తున్నా’’ అని రాసుంది. దీంతో ఈ ఉత్తరం చేరాల్సిన వారి అడ్రస్ వెతికేపనిలో ఆ దంపతులు పడ్డారు. ఈ ఉత్తరం వారికి చేర్చడం ద్వారా మరోసారి ఆనాటి అనుభూతులను ఫ్రెష్ గా మేల్కొల్పే అవకాశం దక్కుతుందని వారు భావిస్తున్నారు.