: ఐఎస్ తదుపరి టార్గెట్ అమెరికానే!... ట్విట్టర్ లో ముష్కర మూక హెచ్చరిక!
ప్రపంచ దేశాలను భయకంపితులను చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) తదుపరి లక్ష్యం అగ్రరాజ్యం అమెరికానేనట. ఈ మేరకు ఆ సంస్థలకు చెందినదిగా భావిస్తున్న ట్విట్టర్ ఖాతాలో కొద్దిసేపటి క్రితం ఓ హెచ్చరిక ప్రత్యక్షమైంది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి అమెరికా బయలుదేరే విమానాలను ఆసరా చేసుకుని అమెరికాలోని లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయాలను పేల్చేస్తామని ఐఎస్ సదరు ట్వీట్ లో హెచ్చరించింది. హీత్రూ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరే విమానాల్లో బాంబులను పెట్టి ఈ దుశ్చర్యకు పాల్పడనున్నట్లు కూడా ఆ ట్వీట్ చెబుతోంది. ఈ వారంలోనే టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టు, తాజాగా బంగ్లా రాజధాని ఢాకాపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు ప్రపంచ దేశాలను వణికించారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రజలు మునిగి ఉన్న సమయంలో ఈ దాడులు చేయనున్నట్లు కూడా ఐఎస్ హెచ్చరించింది.