: పాలేరు చెక్ డ్యాం ఎత్తు తగ్గించండి: చంద్రబాబును కోరిన తమిళనాడు ముఖ్యమంత్రి
చిత్తూరు జిల్లాలోని పెరుంబళంలో నిర్మిస్తున్న చెక్ డ్యాం ఎత్తుపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పాలేరు నదిపై నిర్మిస్తున్న చెక్ డ్యాం ఎత్తును 12 అడుగులకే పరిమితం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. డ్యాం ఎత్తు పెంచవద్దని, అదనంగా నీటిని నిల్వచేయవద్దని పేర్కొన్నారు. దిగువనున్న తమిళనాడు అభ్యంతరాలను తోసిరాజని ఎత్తు పెంచడం తగదన్నారు. ఇప్పటికే నదిలో చాలా తక్కువ నీరు ఉందన్న జయలలిత.. తమిళనాడులోని 4.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలేరు నీటిని అందిస్తోందన్నారు. రైతులు కేవలం ఈ నదిపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారని, కాబట్టి తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని డ్యాం ఎత్తును 12 అడుగులకే పరిమితం చేయలని చంద్రబాబును కోరారు. పాలేరు నదిపై ఎటువంటి నిర్మాణాలు జరపకుండా ఏపీని నిలువరించాలని కోరుతూ ఫిబ్రవరి 10, 2006లో సుప్రీంకోర్టులో దావా వేసినట్టు జయలలిత పేర్కొన్నారు.