: రంగంలోకి బంగ్లా ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్!... ఐదుగురు ఉగ్రవాదుల హతం!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ముష్కరులపై ఆ దేశ పోలీసులు పైచేయి సాధించారు. ఢాకాలోని దౌత్య కార్యాలయాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న గుల్షాన్ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు. విదేశీయులను హత్య చేయడమే ప్రధాన లక్ష్యంగా బరితెగించిన ఉగ్రవాదులు అక్కడి హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్ లోకి చొచ్చుకెళ్లారు. బేకరిలోకి రాగానే కాల్పులకు దిగిన ఉగ్రవాదులు బంగ్లా పోలీసులకు పెను సవాల్ విసిరారు. అయితే వేగంగా స్పందించిన బంగ్లా ఉన్నతాధికారులు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ ను రంగంలోకి దించారు. ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ దెబ్బకు ఉగ్రవాదులు బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య సాగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని బెటాలియన్ సజీవంగా పట్టుకుంది. బేకరీలో మరో నలుగురు ఉగ్రవాదులున్నట్లు సమాచారం వీరిని మట్టుబెట్టేందుకు బెటాలియన్ తీవ్రంగా యత్నిస్తోంది. ప్రస్తుతం అక్కడ కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది.