: షీనా బోరా హంతకురాలు ఇంద్రాణీ!... కూతురుపై కూర్చుని గొంతు నులిమేసిన కసాయి తల్లి!
దేశవ్యాప్తంగా కలకలం రేపిన షీనా బోరా హత్య కేసులో కరుడుగట్టిన కసాయి తల్లి వైనం వెలుగుచూసింది. షీనాను ఆమె కన్న తల్లి ఇంద్రాణీ ముఖర్జీయానే అత్యంత దారుణంగా హత్య చేసిందట. ఈ మేరకు ఈ కేసులో అప్రూవర్ గా మారిన ఇంద్రాణీ కారు డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ హత్య జరిగిన తీరును కళ్లకు కట్టాడు. 2012, ఏప్రిల్ 24న జరిగిన ఈ హత్యోదంతం గతేడాది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాకూ పాత్ర ఉన్నట్లు కూడా శ్యామ్ వర్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ మేరకు శ్యామ్ వర్ ఇచ్చిన 12 పేజీల వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టు నిన్న నిందితులందరికీ అందజేసింది. అందులోని వివరాల ప్రకారం... వరుసకు సోదరుడైన పీటర్ కుమారుడు రాహుల్ తో ప్రేమలో పడిన కారణంగానే షీనాను ఆమె తల్లి ఇంద్రాణీ మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె రచించిన పథకానికి పీటర్ సహా శ్యామ్ వర్ రాయ్, ఇంద్రాణీ మాజీ భర్త సంజీవ్ ఖన్నాలు సహకరించారు. కారులోనే షీనా హత్య జరిగింది. కారులో ఎక్కించుకున్న షీనాను శ్యామ్ వర్, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియాలు కదలకుండా పట్టుకోగా, షీనాపై కూర్చున్న ఇంద్రాణీ ఆమె గొంతు నులిమేసింది. ఈ క్రమంలో ప్రాణాలు కాపాడుకునేందుకు వారితో పెనుగులాడిన షీనా... శ్యామ్ వర్ చేతిని కొరికేసింది. దీంతో అతడి చేతికి గాయమైంది. పెనుగులాడుతున్న కూతురును చూసి ఏమాత్రం కనికరం లేకుండా ఇంద్రాణీ ఆమె గొంతు నులిమి హత్య చేసింది.