: 2024 ఒలింపిక్స్ లో క్రికెట్?
అన్నీ అనుకూలిస్తే 2024 ఒలింపిక్స్ లో క్రికెట్ ను చూసే అవకాశం ఉంది. 2024 ఒలింపిక్ క్రీడల నిర్వహణ హక్కులు తమకు దక్కితే కచ్చితంగా క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేరుస్తామని ఇటాలియన్ బోర్డు చీఫ్ సిమోన్ గంబినో వెల్లడించారు. ఈ మేరకు ఆర్గనైజింగ్ కమిటీ తమకు కచ్చితమైన హామీ ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. 2024 ఒలింపిక్స్ నిర్వహణ కోసం రోమ్, పారిస్, లాస్ ఏంజెల్స్, బుడాపెస్ట్ పోటీ పడుతున్నాయి. ఆతిథ్య నగరం ఏదైనా దానికి కొత్తగా ఐదు గేమ్స్ ను ఒలింపిక్స్ లో చేర్చే అవకాశం ఉంటుంది. దీంతో రోమ్ కి ఆతిథ్య హక్కులు దక్కితే క్రికెట్ ను బొలొగ్నాలో నిర్వహించాలని ఇటలీ భావిస్తోంది. అయితే వాస్తవానికి టీ20 ఫార్మట్ క్రికెట్ ను ఒలింపిక్స్ లో భాగం చేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఇందుకోసం గతంలో లాబీయింగ్ కూడా జరిగింది. 2010లో నాలుగు డివిజన్ స్థాయి మ్యాచ్ లు కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో బలమైన లాబీయింగ్ లేని కారణంగా ఒలింపిక్స్ లో క్రికెట్ నిర్వహణ సాధ్యం కాలేదు. అయితే ఈసారి మాత్రం ఆ డిమాండ్ నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది.