: 'సూపర్-30' ఆనంద్ కుమార్‌కి ‘ఎడ్ఎక్స్’లో బోధించే అవకాశం
సూపర్-30... పరిచయం అవసరం లేని ఇనిస్టిట్యూట్. ఐఐటీ పరీక్షల్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులను రాణించేలా చేయడమే లక్ష్యంగా ఆనంద్ కుమార్ అనే ఓ సాధారణ వ్యక్తి 2002లో స్థాపించిన సూపర్-30 పేరు విదేశాల్లోకీ పాకింది. సూపర్-30 పేరుతో ప్రతి ఏడాది దేశం మొత్తం మీద ఎంపిక చేసిన 30 మంది పేద విద్యార్థులకు శిక్షణనిస్తోన్న ఆనంద్ కుమార్‌కు తాజాగా ఓ లేఖ వచ్చింది. ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫాం 'ఎడ్ఎక్స్' లో గణితశాస్త్రం బోధించాలని ఆనంద్ కుమార్‌ని ఎమ్ఐటీ ప్రొఫెసర్ అనంత అగర్వాల్ ఆ లేఖలో కోరారు. 'ఎడ్ఎక్స్' వెబ్ సైట్ ను మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు ప్రమోట్ చేస్తోన్న విషయం తెలిసిందే. పలు కోర్సులను ఉచితంగా అందిస్తోన్న ఈ వెబ్‌సైట్‌కి సూపర్-30 కూడా తోడయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని ప్రొఫెసర్ అనంత అగర్వాల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆనంద్ కుమార్ తనకు వచ్చిన లేఖ పట్ల సానుకూలంగా స్పందించారు. పేదల కోసం ఎడ్ఎక్స్ కృషి చేయడం అభినందనీయం అని ఆయన అన్నారు. ఎమ్ఐటీ, హార్వర్డ్ లాంటి విద్యాసంస్థలు తమతో కలసి పనిచేయాలనుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎడ్ఎక్స్ లో బోధిస్తానని స్పష్టం చేశారు.