: యూపీ సీఎం అఖిలేష్ ను పలకరించని బాబాయ్... ములాయం కుటుంబంలో మరింత పెరిగిన విభేదాలు!
ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట విభేదాలు మరింతగా పెరిగాయి. కువామీ ఏక్తాదళ్ పార్టీని ఎస్పీలో విలీనం చేసే విషయంలో ములాయం సోదరుడు శివ్ పాల్ యాదవ్ చొరవ తీసుకోవడం, అయితే ఆ పార్టీ అధినేతకు క్రిమినల్ నేపథ్యం ఉండడంతో ముఖ్యమంత్రి అఖిలేష్ ఆ విలీనాన్ని ఒప్పుకోకపోవడం తెలిసిందే. దీంతో శివ్ పాల్ ముఖ్యమంత్రిపై అలగడం జరిగింది. ఈ క్రమంలో తన మరో సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ పుట్టిన రోజు వేడుకల్లో అంటీముట్టనట్టు ఉండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సోదరుడి పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుగుతుంటే, ఆలస్యంగా వచ్చి వేదిక ఎక్కకుండా ఆహూతుల మధ్య కూర్చోవడం జరిగింది. ఆపై పిలిస్తే ముక్తసరిగా వేదిక ఎక్కి వెనక వరసలో కూర్చున్నారు. కుమారుడి వరసైన అఖిలేష్ ను పలకరించనే లేదు. గోపాల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయలేదు. మూడు రోజుల నాడు జరిగిన అఖిలేష్ మంత్రివర్గ విస్తరణకూ ఆయన హాజరు కాలేదు. దీంతో ములాయం కుటుంబంలో ఉన్న విభేదాలు మరింతగా పెరిగాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.