: ఎవరు ఉంటారు? ఎవరు పోతారు? నేడు చెప్పనున్న నరేంద్ర మోదీ!


వచ్చే సంవత్సరం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం, రెండేళ్ల క్రితం ఏర్పడిన తన ప్రభుత్వంలో ఇంతవరకూ మార్పులు చేర్పులు లేకపోవడంతో క్యాబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, నేడు తన మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రుల పనితీరుపై తనకు అందిన సమీక్షా సమాచారం వివరాలను వారి ముందుంచే ప్రధాని, అసంతృప్తికరంగా పనిచేస్తున్న వారిని హెచ్చరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో మంత్రులు గత రెండేళ్లలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజెంటేషన్ సిద్ధం చేసుకు రావాలని కూడా ప్రధాని కార్యాలయం నుంచి మంత్రులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. నేడు మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా ఈ సమీక్షా సమావేశం జరుగుతుందని ఎన్డీయే వర్గాలు వెల్లడించాయి. కాగా, నిన్న బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని కలసి దాదాపు 5 గంటల పాటు మంతనాలు జరపడంతో క్యాబినెట్ విస్తరణ నేడు జరుగుతుందన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇక నేటి సమావేశంలో కేంద్ర మంత్రుల్లో ఎవరు ఉంటారో? ఎవరు పోతారో? అన్న స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొంతమంది సీనియర్ల పోస్టుల్లో కొత్తవారు రావచ్చని సమాచారం. వచ్చే నెల 6 నుంచి ప్రధాని ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుండగా, ఈలోగానే పునర్వ్యవస్థీకరణ ఉంటుందని తెలుస్తోంది. ఆపై 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త మంత్రివర్గంతోనే మోదీ సర్కారు హాజరవుతుందని, ప్రస్తుతం సహాయమంత్రులుగా ఉన్న పీయుష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ లకు ప్రమోషన్లు లభించవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక అసోం రాష్ట్రానికి సీఎంగా వెళ్లిన శర్వానంద సోనోవాల్ స్థానంలో ఒకరిని, మహారాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా వెళ్లిన రావ్ సాహెబ్ పాటిల్ స్థానంలో మరొకరికి స్థానం లభించనుంది.

  • Loading...

More Telugu News