: వైఎస్ జగన్ పై లోకేశ్ సెటైర్లు... వైసీపీ అధినేతలా జైలుకెళ్లాలన్న కోరిక లేదని వ్యంగ్యం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలిలో వాగ్బాణాలు సంధిస్తున్నారు. నిన్నటికి నిన్న విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా జగన్ అవినీతిపై విరుచుకుపడ్డ లోకేశ్... తాజాగా నేటి ఉదయం వ్యంగ్యాస్త్రాలతో జగన్ పై విమర్శలు కురిపించారు. వైసీపీ అధినేతలా తనకు జైలుకెళ్లాలన్న కోరిక ఎంతమాత్రం లేదని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలోని పంజా సెంటర్ లో నేటి ఉదయం పేదలకు రేషన్ కిట్లను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజల సంక్షేమానికి టీడీపీ సర్కారు అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ఆరోపణలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని కూడా ఆయన అన్నారు.