: ఐఎస్ పై అమెరికా ముప్పేట దాడి... ఫలూజాలో 250 మంది ముష్కరుల హతం
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) పై అగ్రరాజ్యం అమెరికా నిన్న ముప్పేట దాడికి దిగింది. టర్కీలోని ఇస్తాంబుల్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రవాదులు విరుచుకుపడిన మరుక్షణమే రంగంలోకి దిగిన అమెరికా యుద్ధ విమానాలు ఇరాక్ నగరం ఫలూజా నుంచి పలాయనం చిత్తగిస్తున్న ఐఎస్ పటాలంపై దాడి చేశాయి. ఈ దాడుల్లో 250 మంది దాకా ఐఎస్ ఉగ్రవాదులు మరణించారు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై జరిగిన దాడి ఐఎస్ పనేనన్న టర్కీ అనుమానాలతో అమెరికా ఈ దాడులకు దిగడం గమనార్హం. ఫలూజా నుంచి కూడబలుక్కుని ఇతర ప్రాంతాలకు ఐఎస్ ఉగ్రవాదులంతా పెద్ద సంఖ్యలో వాహనాల్లో బయలుదేరారు. ఈ వాహనాలను టార్గెట్ చేసిన అమెరికా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 40 వాహనాలు ధ్వంసం కాగా 250 మంది ముష్కరులు హతమయ్యారని అమెరికా ప్రకటించింది.