: సల్మాన్ రిప్లై ఇచ్చాడు... కానీ క్షమాపణలు మాత్రం చెప్పలేదు!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఇటీవల మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చాడు. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు మాత్రం ఆయన క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం. త్వరలో రాబోతున్న సల్మాన్ సినిమా ‘సుల్తాన్’ గురించి ఓ ఇంటర్వ్యూలో సల్లూ భాయ్ మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ చేసినప్పుడు తన పరిస్థితి 'రేప్‌కు గురైన మహిళ’లా వుండేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సల్మాన్‌పై మహిళలు మండిపడ్డారు. అతడి నివాసాన్ని ముట్టడించారు. కాగా, సల్మాన్ వ్యాఖ్యలపై ఆయన తండ్రి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరారు. కొడుకు చేసింది ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నారు. అయితే అతడి ఉద్దేశం మాత్రం సరైనదేనని పేర్కొన్నారు. కాగా మహిళా కమిషన్ నోటీసులకు సమాధానం ఇచ్చిన సల్మాన్ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు మాత్రం వేడుకోలేదు. ఆయన రిప్లైపై నేడు మహిళా కమిషన్ స్పందించే అవకాశం ఉంది.