: విండోస్ 10 ఓఎస్ అప్ గ్రేడ్ పై మండిపడ్డ మహిళకు ‘మైక్రోసాఫ్ట్’ నష్టపరిహారం


కొత్త ఫీచర్లతో మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ను గత ఏడాది మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త వెర్షన్ ను అప్ గ్రేడ్ చేసుకోమంటూ యూజర్లకు పలు నోటీసులు పంపుతుండటం ‘మైక్రోసాఫ్ట్’కు తలనొప్పి తెచ్చిపెట్టింది. అందరికీ పంపించినట్లే కాలిఫోర్నియాలోని సాసాటోకు చెందిన మహిళ టెరీ గోల్డ్ స్టీన్ కు ఈ కొత్త వెర్షన్ ను అప్ గ్రేడ్ చేసుకోమంటూ పదే పదే నోటీసులు పంపింది. ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న టెరీ కంప్యూటర్ విండోస్ 7 ఓఎస్ తో పనిచేస్తోంది. అప్ గ్రేడ్ విషయమై ‘మైక్రోసాఫ్ట్’ పంపిన ఈ నోటీసులను టెరీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, టెరీకు తెలియకుండానే ఆమె ఉపయోగించే కంప్యూటర్ విండోస్ 10తో అప్ డేట్ అయిపోయింది. దీంతో, ఆమె కంప్యూటర్ పనిచేయడం మానేయడంతో టెరీ వ్యాపారకార్యక్రమాలు దెబ్బతిన్నాయి. దీంతో, ఆగ్రహించిన ఆమె ‘మైక్రోసాఫ్ట్’పై కోర్టు కెక్కింది. తనకు నష్టపరిహారం కింద 17 వేల డాల్లరు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు టెరీకు 10 వేల డాలర్లు నష్టపరిహారం కింద చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో ‘మైక్రోసాఫ్ట్’ మూల్యం చెల్లించుకోక తప్పలేదు.

  • Loading...

More Telugu News