: కర్ణాటక సీఎంను శపించిన మాంత్రికుడు... పట్టించుకోనందునే అప్రతిష్ఠలంటూ కార్యకర్తల ఆందోళన!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుయాయుల్లో ఇప్పుడు కొత్త భయం ఆవరించింది. కొల్లెగల ప్రాంతానికి చెందిన ఓ మంత్రగాడు ఆయన్ను శపించాడని, అందువల్లే ఇటీవలి పరిణామాలు తమ సీఎం ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, కొద్ది కాలం క్రితం సిద్ధరామయ్య వద్దకు వచ్చిన ఆ మాంత్రికుడు, తాను మంత్రించిన వస్రాన్ని తీసుకోవాలని కోరాడట. తనకు అలాంటి నమ్మకాలు లేవని సిద్ధరామయ్య సున్నితంగా తిరస్కరించారట. ఆపై, తన కుటుంబం కష్టాల్లో ఉందని, భార్యకు అనారోగ్యమని, ఆదుకోవాలని కోరాడట. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్ధరామయ్య, ఇలా అబద్ధాలతో చాలామంది బతుకుతున్నారని తిట్టారట. దీంతో ఆయన పక్కకు వెళ్లి, కారు డ్రైవర్ విండో నుంచి సీఎంను శపించినట్టు అనుచరులు చర్చించుకొంటున్నారు. వాస్తవానికి ఈ వ్యక్తి వచ్చిన కల్లెగల ప్రాంతం మంత్రగాళ్లకు పెట్టింది పేరు. ఎన్నికలు జరిగే సమయంలో రాజకీయ నాయకులంతా, ఇక్కడికి వచ్చి తమ విజయాల కోసం మంత్ర పూజలు చేయించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నోమార్లు, కొల్లెగల మాంత్రికులతో తమపై క్షుద్రపూజలు ప్రయోగిస్తున్నారని జేడీ (ఎస్)పై ఆరోపణలు గుప్పించింది కూడా. ఈ నేపథ్యంలో మంత్రగాడి శాపం, తమ నేతకు ఇంకా ఎన్ని కష్టాలు తెచ్చి పెడుతుందోనని చోటా నేతలు, అభిమానులు భయపడుతున్నారు.