: హైదరాబాదులో హై అలర్ట్!... 10కి పెరిగిన పట్టుబడ్డ ఉగ్రవాదుల సంఖ్య!


భాగ్యనగరి హైదరాబాదులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భాగ్యనగరిలో భారీ విధ్వంసానికి పథక రచన చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పటికే హైదరాబాదులోకి ప్రవేశించారన్న హెచ్చరికలతో నిన్న రాత్రే జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. పాతబస్తీ పరిధిలోని చాంద్రాయణగుట్ట, భవానీ నగర్, మొఘల్ పురా, మీర్ చౌక్, తలాబ్ కట్టా, బార్కస్ తదితర ప్రాంతాల్లో ముమ్మర సోదాలు చేసిన ఎన్ఐఏ అధికారులు ఇప్పటిదాకా 10 మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. విడతలవారీగా దొరికిన ఉగ్రవాదులను రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు అసలు వారి ప్రణాళిక ఏమిటన్న విషయంపై కూపీ లాగుతున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం. పక్కా ప్రణాళికతో మూడు, నాలుగు నెలల క్రితమే హైదరాబాదు చేరుకున్న ఉగ్రవాదులు పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. నగరంలోని పాతబస్తీ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరు తలదాచుకున్నారు. హైదరాబాదులోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో వారు తమ వెంట భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, తుపాకులు, నకిలీ కరెన్సీని తీసుకొచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా నగరంలోకి ప్రవేశించిన మరుక్షణమే దాడుల కోసం ఎంచుకున్న పలు ప్రాంతాలపై వీరు రెక్కీ కూడా నిర్వహించారట. ఈ భీతిగొలిపే విషయాలు తెలియడంతో నగరవ్యాప్తంగా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News