: దీక్ష చేస్తానంటే చేసుకోండి!... కేంద్రంపై నిందలు తగవు!: కేసీఆర్ కు షాకిచ్చిన సదానంద!


రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టును కూడా విభజించాలన్న తెలంగాణ వాదనను కేంద్ర ప్రభుత్వం చాలా తేలిగ్గా కొట్టి పారేసింది. ఓ వైపు ఏకంగా 11 మంది న్యాయమూర్తుల సస్పెన్షన్, 200 మంది జడ్జీల సామూహిక సెలవు నేపథ్యంలో హైదరాబాదులోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా న్యాయ వ్యవస్థ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో నిన్న న్యాయవాదులను వెంటబెట్టుకుని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ... కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను కలిశారు. ఈ సందర్భంగా భేటీ అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన సదానంద కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజన అంశం అసలు తమ పరిధిలో లేని అంశమని ఆయన తెలంగాణ సర్కారుకు షాకిచ్చారు. హైకోర్టు విభజన పూర్తిగా ఏపీ సీఎందేనని సదానంద తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఏపీ సీఎం తీసుకున్న చర్యలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అందుకనుగుణంగా చేపట్టిన చర్యలను పరిశీలించి కేంద్రం నోటిఫికేషన్ మాత్రమే జారీ చేస్తుందని ఆయన చెప్పారు. అయితే ఈ వాస్తవాన్ని మరిచి దీక్ష చేస్తానంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనలపై ఘాటుగా స్పందించారు. ‘‘ఢిల్లీకి వస్తా. దీక్ష చేస్తా అని కేసీఆర్ అంటున్నారు. స్వాగతం. రండి. ధర్నా చేసుకోండి. ఎవరొద్దన్నారు? కానీ, ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లా వ్యవహరించకూడదు. కేజ్రీవాల్ కేంద్రాన్ని రోజూ ఏదో ఒక మాట అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా అలానే చేస్తే ప్రజలే సరైన సమాధానం చెబుతారు’’ అని సదానంద వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News