: కోచ్ పోస్టు కోసం కుంబ్లేను ఢీకొన్న ఆసీస్ దిగ్గజం!... రవిశాస్త్రి కంటే మెరుగైన ప్రజెంటేషన్ ఇచ్చిన మూడీ!
టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేతో జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి చివరి దాకా పోటీ పడ్డట్టు వచ్చిన వార్తల్లో పస లేదని తేలిపోయింది. కుంబ్లేను నిలువరించి అతడితో హోరాహోరీగా పోటీకి దిగిన క్రికెటర్ వేరే ఉన్నారని ఓ తాజా కథనం వెలుగులోకి వచ్చింది. రవిశాస్త్రి కంటే మెరుగైన ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా కుంబ్లే కంటే కూడా మెరుగైన మార్కులే వేయించుకున్న సదరు మాజీ క్రికెటర్... ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీగా తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ పదవికి కొందరు విదేశీయులు కూడా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే అయినా... వారిలో టామ్ మూడీ ఉన్నట్లు చాలా మందికి తెలియలేదు. ఇంటర్వ్యూలో భాగంగా కోచ్ గా తనకున్న అనుభవాన్ని సమగ్రంగా వివరించిన మూడీ... క్రికెట్ అడ్వైజరీ కమిటీని మెప్పించాడట. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న అతడి అనుభవం కూడా కమిటీని ఆకట్టుకుంది. ఈ క్రమంలో కుంబ్లే కంటే కూడా మూడీ వైపే కోచ్ పదవి మొగ్గింది. అయితే చివరాఖరుకు దేశీయ స్పిన్ దిగ్గజం కుంబ్లేనే హెడ్ కోచ్ గా ఎంపిక చేసిన బీసీసీఐ మూడీకి మాత్రం మొండిచేయి చూపింది.