: గో మూత్రంలో బంగారం.. పరిశోధనలో వెలుగుచూసిన వైనం!
గోమాతను చాలామంది దైవంగా భావిస్తారు. గోవును తాకితేనే పాపాలు హరించిపోతాయని చెబుతారు. గోమూత్రం ఔషధాల నిలయమని మరికొందరు చెబుతారు. కొన్ని చికిత్సల్లో దానిని ఔషధంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గోమూత్రంలో బంగారం దాగుందనే విషయం తాజాగా వెలుగుచూసింది. గిర్ జాతి ఆవుల మూత్రంపై గుజరాత్‌లోని జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(జేఏయూ) నిర్వహించిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 400 గిర్ ఆవుల నుంచి సేకరించిన మూత్రం నమూనాలను జేఏయూలోని ఆహార పరీక్ష ల్యాబ్‌లో పరీక్షించగా లీటర్ మూత్రంలో మూడు నుంచి 10 మిల్లీ గ్రాముల బంగారం ఉన్నట్టు బయటపడింది. అయాన్ల రూపంలో బంగారం ఉన్నట్టు పరిశోధనకారులు పేర్కొన్నారు. పరిశోధన కోసం గ్యాస్ క్రోమటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ(జీసీ-ఎంఎస్) పద్ధతిలో మూత్రం నమూనాలను విశ్లేషించినట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ బీఏ గొలాకియా పేర్కొన్నారు. గో మూత్రంలో బంగారం ఉంటుందని పూర్వీకులు చెప్పగా వినడమే తప్ప ఇంతవరకు శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదన్నారు. ఈ విషయాన్ని తేల్చేందుకే తామీ పరిశోధన చేపట్టినట్టు గొలాకియా తెలిపారు. 400 గిర్ ఆవుల నుంచి సేకరించిన మూత్రం శాంపిల్స్‌లో బంగారం ఉన్నట్టు తాము కనుగొన్నామని ఆయన పేర్కొన్నారు. ఒంటెలు, గేదెలు, గొర్రెలు, మేకల నుంచి సేకరించిన మూత్రంపైనా పరిశోధనలు చేయగా అందులో యాంటీ బయోటిక్ పదార్థాలు కనిపించలేదన్నారు. గోమూత్రంలో బంగారంతో పాటు పలు ఔషధ గుణాలను కూడా తాము కనుగొన్నట్టు గొలాకియా వివరించారు.