: రెండో రోజు సక్సెస్... రూ. 53 వేల కోట్ల పెట్టుబడులు; దొనకొండకు ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్క్


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం రెండో రోజు చైనా పర్యటన ఫలవంతమైంది. మొత్తం రూ. 54 వేల కోట్ల విలువైన పెట్టుబడులు నవ్యాంధ్రకు వచ్చేలా వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. దొనకొండలో రూ. 43 వేల కోట్ల అంచనా వ్యయంతో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు అవగాహనా ఒప్పందం కుదిరింది. చైనా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ తో కుదిరిన ఒప్పందం మేరకు మూడు దశల్లో ఈ పార్కు నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పార్కు నిర్మాణం జరిగితే 55 వేల మందికి ఉపాధి లభ్యం కానుంది. మొదటి దశలో రూ. 10,106.2 కోట్లు, రెండవ దశలో రూ. 12, 127.6 కోట్లు, మూడో దశలో రూ. 14,148.8 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. తొలిదశ పూర్తయితేనే 10 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అధికారులు వివరించారు. రూ. 10 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో కృష్ణపట్నం వద్ద ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం డీల్ కుదుర్చుకుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి విదేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ఎతిహాద్ ముందుకు వచ్చింది. ఈ మేరకు విమాన సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర అధికారులు సంతకాలు చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా ఈ పర్యటనకు వచ్చామని, సాధ్యమైనన్ని ఎక్కువ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువెళ్లడమే తమ ఉద్దేశమని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చలు జరుపుతూ రోజంతా బిజీగా గడిపారు. చంద్రబాబు బృందం నేడు టియాంజిన్ నుంచి గుయాంగ్ నగరానికి వెళ్లనుంది.

  • Loading...

More Telugu News