: యువతి ప్రాణం తీసిన ‘ఫేస్‌బుక్’ పోస్టింగ్!
చాటింగ్‌లు, ఫొటో షేరింగులతో సామాజిక మాధ్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఫేస్‌బుక్ మరొకరి ప్రాణం తీసింది. అర్ధనగ్నంగా ఉన్న తన ఫొటోను ఫేస్‌బుక్‌లో చూసిన ఓ యువతి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని సేలంలో సోమవారం చోటుచేసుకుందీ విషాద ఘటన. 21ఏళ్ల వినుప్రియ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫొటో పోస్టు చేసిన నిందితుడిని అరెస్ట్ చేసేంత వరకు తన కుమార్తె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లేది లేదని ఆమె తండ్రి అన్నాదురై పేర్కొన్నారు. వినుప్రియ ఆత్మహత్య అనంతరం ఫేస్‌బుక్ నుంచి ఆమె అర్ధనగ్న ఫొటో మాయం కావడం గమనార్హం. గతవారం కూడా ఫేస్‌బుక్‌లో తన ఫొటోను చూసిన బాధితురాలు వెంటనే తల్లిదండ్రులకు చెప్పింది. వారు జూన్ 23న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15 రోజుల్లో నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు అభయమిచ్చారు. అయితే అంతలోనే ఆదివారం ఆమె మార్ఫింగ్ ఫొటో మరొకటి ఫేస్‌బుక్‌లో పోస్టు అవడంతోపాటు ఆ లింక్‌ను ఆమె సెల్‌ఫోన్‌కు పంపడంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. దర్యాప్తును వేగవంతం చేసేందుకు 2వేల రూపాయలు పెట్టి సైబర్ క్రైం పోలీసులకు సెల్‌ఫోన్ కొనిచ్చినా ఫలితం మాత్రం లేకుండా పోయిందని అన్నాదురై సంచలన వ్యాఖ్యలు చేశారు. వినుప్రియ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫేస్‌బుక్‌లో ఫొటో పోస్టు చేసిన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా ఇటీవల ఫేస్‌బుక్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్న విషయం విదితమే.