: బ్రిటన్ వాసుల్లో జాతి వ్యతిరేక ధోరణి... పరాయివారు పోవాలని దాడులు!
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని ఇప్పటికే తీర్పిచ్చిన ప్రజలు, తమకు నష్టం కలగడానికి కారణం వలసవాదులేనని భావిస్తూ, ఇతర దేశాల వారు బ్రిటన్ వీడి వెళ్లాలని ఉద్యమిస్తుండటం ఆందోళనను పెంచుతోంది. గురువారం నాటి రెఫరెండం తరువాత పలు జాతి వ్యతిరేక ఘటనలు లండన్ పరిసరాల్లో జరిగినట్టు తెలుస్తోంది. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు విచారణ చేపట్టారు. పశ్చిమ లండన్ ప్రాంతంలోని ఓ పోలాండ్ కల్చరల్ సెంటర్ వద్ద 'గో హోమ్' అని గోడలపై స్లోగన్లు కనిపించాయని, కేంబ్రిడ్జ్ షైర్ వద్ద ఓ ప్రాథమిక పాఠశాల వద్ద కూడా జాతి వ్యతిరేక నినాదాలు కనిపించాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే, యూకేలో జాతి వ్యతిరేకత పెరిగేందుకు అవకాశాలే లేవని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మాజీ సభ్యుడు ఆడమ్ పోసెన్ వ్యాఖ్యానించారు. కాగా, బ్రెగ్జిట్ తరువాత లండన్ లో పలు ప్రాంతాల్లో బ్రిటన్ వాసులు, విదేశీయులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. సెబాస్టియన్ అనే ఓ ఫ్రెంచ్ వ్యక్తి, తన స్నేహితుడితో కలసి కెన్సింగ్టన్ జిల్లాలో పర్యటిస్తున్న వేళ, వారు ఫ్రెంచ్ భాషలో మాట్లాడుకోవడాన్ని విని 'లీవ్... లీవ్' అని కేకలు పెట్టారని, మరో వ్యక్తి తన పెంపుడు కుక్కను తమపై ఉసిగొల్పాడని ఆయన ఫిర్యాదు చేశారు. పశ్చిమ లండన్ లో ఇతర దేశాల స్కూలు విద్యార్థులను తిడుతున్నారని విపక్ష పార్టీ ప్రజా ప్రతినిధి, ఎన్నారై సీమా మల్ హోత్రా వ్యాఖ్యానించారు. "ఆ తరగతిలో తెల్లవారి పిల్లలు పదిమందే ఎందుకు వున్నారు? మన పిల్లలకి మనం ఎందుకు చదువు చెప్పించుకోవడం లేదు?' అంటూ ఒకరు క్లాసులో నినాదాలు చేశారు. మరో ఘటనలో పిల్లల వద్దకు వెళ్లి, మీరే మా సమస్య... మా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు" అని అన్నట్టు ఆమె తెలిపారు. కాగా, పెరుగుతున్న జాతి వ్యతిరేకతపై మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఆందోళన వ్యక్తం చేశారు. బీబీసీతో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రమాదాన్ని నివారించాల్సిన బాధ్యత దేశంలోని రాజకీయ నేతలందరిపైనా ఉందని, ప్రపంచ పటంలో బ్రిటన్ కున్న మంచి పేరును చెడగొట్టవద్దని కోరారు. ప్రస్తుతం దేశం విడిపోయినట్టు కనిపిస్తున్నప్పటికీ, ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం కష్టమేమీ కాదని అభిప్రాయపడ్డారు.