: ముస్లింలను కేసీఆర్ మరోసారి మోసం చేశారు: షబ్బీర్ అలీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కేసీఆర్ మరోసారి మోసం చేశారని ఆయన అన్నారు. ముస్లింల స్థితిగతులను చర్చించడానికి వేసిన సుధీర్ కమిటీకి చట్టబద్ధత లేదని ఆయన వ్యాఖ్యానించారు. కమిటీ ముస్లింల రిజర్వేషన్లపై కాకుండా కేవలం ముస్లింల స్థితిగతులపై మాత్రమే సమాచారం సేకరిస్తోందని అన్నారు. ఈ అంశంపై ఒవైసీ సోదరులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ కలసి డబుల్ గేమ్ ఆడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి పట్ల షబ్బీర్ అలీ అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ రైతులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని ఆయన అన్నారు. మల్లన్న సాగర్‌కు వెళ్లి భూనిర్వాసితులతో చర్చించే ధైర్యం ప్రభుత్వ నేతలకు ఉందా..? అని ఆయన ప్రశ్నించారు.