: నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు: ఢిల్లీలో కేటీఆర్ హర్షం
కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో ఈరోజు చర్చించినట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గతంలో కేంద్రం పన్ను రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించిందని, వాటిని అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ అంశం తమ పరిశీలనలో ఉందని కేంద్రమంత్రి చెప్పారని ఆయన అన్నారు. బహుళ ఉత్పత్తుల సెజ్‌లు 2 మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. పూర్తి స్థాయి ప్రతిపాదనతో రమ్మని కేంద్ర మంత్రి సూచించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను మరింత తీర్చిదిద్దడానికి నిధులు కోరినట్లు కేటీఆర్ తెలిపారు. చాలా విషయాల్లో నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో బయో ఫార్మాపై దృష్టి పెట్టాలని కేంద్రమంత్రి సూచించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో ఫార్మా సిటీకి తొలివిడతలో రూ.200 కోట్లు ఇస్తామని నిర్మలా సీతారామన్ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.